Text copied!
Bibles in Telugu

లూకా 9:19-46 in Telugu

Help us?

లూకా 9:19-46 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వారు, “బాప్తిసమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు” అని ఆయనకు జవాబిచ్చారు.
20 అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు.
21 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు.
22 “మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది.” అని చెప్పాడు.
23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు.
25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?
26 నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
27 అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
28 ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు.
29 ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి.
30 ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలీయాలు.
31 వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు.
32 పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.
33 ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, “ప్రభూ, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం” అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు.
34 అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు.
35 తరువాత, “ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి” అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది.
36 ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.
37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
38 ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు.
39 చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది.
40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు.
41 యేసు, “విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?” అని, “నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా” అని ఆ తండ్రితో చెప్పాడు.
42 వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.
43 అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
44 ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు”
45 అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.
46 తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.
లూకా 9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019