Text copied!
Bibles in Telugu

లూకా 21:8-38 in Telugu

Help us?

లూకా 21:8-38 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఆయన, “మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. చాలా మంది నా పేర వచ్చి, ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.
9 మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
10 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.
11 కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.
12 ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.
13 దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
14 కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి.
15 మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను.
16 తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు.
17 నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.
18 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
19 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.
20 యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.
21 అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.
22 ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.
23 ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.
24 వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.
25 “ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు.
26 ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు.
27 అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.
28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.
29 తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.
30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా!
31 అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.
32 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
33 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
34 “తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.
35 ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.
36 కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
37 ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.
38 ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.
లూకా 21 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019