Text copied!
Bibles in Telugu

యోహాను 9:1-24 in Telugu

Help us?

యోహాను 9:1-24 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.
2 ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు.
3 అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.
4 పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.
5 ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
6 ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు.
7 “సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.
8 అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు.
9 “వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు.
10 వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు.
11 దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు.
12 వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు.
13 ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు.
14 యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం.
15 వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు.
16 “ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది.
17 దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18 వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు.
19 “గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు.
20 దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు.
21 అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు.
22 వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
23 కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు.
24 కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు.
యోహాను 9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019