Text copied!
Bibles in Telugu

యోహాను 8:23-41 in Telugu

Help us?

యోహాను 8:23-41 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అప్పుడు ఆయన, “మీరు కింద ఉండేవారు. నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు. నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు.
24 కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు” అని వారితో చెప్పాడు.
25 కాబట్టి వారు “అసలు నువ్వు ఎవరు?” అని అడిగారు. అప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు. “నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే.
26 మీ గురించి చెప్పడానికీ మీకు తీర్పు తీర్చడానికీ నాకు చాలా సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను.”
27 తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వారు అర్థం చేసుకోలేక పోయారు.
28 కాబట్టి యేసు, “మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయననీ తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నాననీ మీరు గ్రహిస్తారు.
29 నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచి పెట్టలేదు” అని చెప్పాడు.
30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే చాలామంది ఆయనలో నమ్మకముంచారు.
31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు.
32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.
33 అప్పుడు వారు, “మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. ‘మీరు విడుదల పొందుతారు’ అని ఎలా అంటున్నావు?” అన్నారు.
34 దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే.
35 బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు.
36 కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు.
37 మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
38 నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినదే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే పనులు చేస్తున్నారు” అని చెప్పాడు.
39 దానికి వారు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు.
40 దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారుగా. అయితే అబ్రాహాము అలా చేయలేదు.
41 మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు” అని వారితో చెప్పాడు. దానికి వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు” అన్నారు.
యోహాను 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019