Text copied!
Bibles in Telugu

యోహాను 6:7-25 in Telugu

Help us?

యోహాను 6:7-25 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.
8 ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ
9 “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.
10 యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.
11 యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.
12 అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.
13 అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
14 వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.
15 వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.
16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.
17 అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.
18 అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
19 వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
20 అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.
21 ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
22 తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు.
23 అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
24 యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు.
25 సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.
యోహాను 6 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019