Text copied!
Bibles in Telugu

యోహాను 11:12-36 in Telugu

Help us?

యోహాను 11:12-36 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.
13 యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
14 అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
15 నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి” అన్నాడు.
16 దిదుమ అనే మారుపేరున్న తోమా, “యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి” అని తన తోటి శిష్యులతో అన్నాడు.
17 యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు.
18 బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
19 చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
20 అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21 అప్పుడు మార్త యేసుతో, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
22 ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు” అంది.
23 యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు.
24 మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది.
25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
26 బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు.
27 ఆమె, “అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28 ఈ మాట చెప్పిన తరువాత ఆమె వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది.
29 మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది.
30 యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు.
31 మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు.
32 అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది.
33 ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు.
34 వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు.
35 యేసు ఏడ్చాడు.
36 అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.
యోహాను 11 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019