8 యొర్దాను అవతల ఉండే అమోరీయుల దేశానికి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. వారు మీతో యుద్ధం చేశారు గానీ నేను వారిని మీ చేతికి అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. వారిని మీ ముందే నాశనం చేశాను.
9 తరువాత సిప్పోరు కొడుకూ మోయాబు రాజు బాలాకూ బయలుదేరి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడు బిలామును పిలిపిస్తే
10 నేను బిలాము మాట వినలేదు. అయితే అతడు మిమ్మల్ని దీవించాడు. అతని చేతినుండి నేనే మిమ్మల్ని విడిపించాను.
11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. అమోరీయులూ పెరిజ్జీయులూ కనానీయులూ హీత్తీయులూ గిర్గాషీయులూ హివ్వీయులూ యెబూసీయులతో కలిసి యెరికో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను.
12 నేను మీకు ముందుగా కందిరీగలను పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి.
13 మీరు సేద్యం చేయని దేశాన్నీ మీరు కట్టని పట్టణాలనూ మీకిచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లనూ ఒలీవ తోటల పండ్లనూ తింటున్నారు.
14 కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి.