Text copied!
Bibles in Telugu

యెషయా 10:12-29 in Telugu

Help us?

యెషయా 10:12-29 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.
13 ఎందుకంటే అతడు, “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.
14 పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.
15 నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా? ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
16 కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
17 ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
18 ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
19 అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
20 ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
21 యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
22 ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
23 ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.
24 ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “సీయోనులో నివాసం ఉంటున్న నా ప్రజలారా, అష్షూరుకు భయపడవద్దు. ఐగుప్తీయులు చేసినట్టు వాళ్ళు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తమ దండం ఎత్తుతారు.
25 అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”
26 ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
27 ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
28 శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు, మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు. మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు.
29 వాళ్ళు కొండ సందు దాటారు, గెబలో బస చేశారు. రమా వణకుతోంది. సౌలు గిబ్యా నివాసులు పారిపోయారు.
యెషయా 10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019