Text copied!
Bibles in Telugu

మార్కు 8:10-27 in Telugu

Help us?

మార్కు 8:10-27 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
11 పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.
12 దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు.
13 తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.
15 యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
16 శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
17 అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు.
20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు.
21 ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు.
23 యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు.
24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు.
25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
26 యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.
27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు.
మార్కు 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019