11 అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.
12 తరువాత రాబోయే రాజు, ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? అనుకుని, నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను.
13 అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.
14 జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.
15 కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.
16 బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు. బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.