Text copied!
Bibles in Telugu

కీర్తన 89:25-50 in Telugu

Help us?

కీర్తన 89:25-50 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.
26 నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.
27 నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.
28 నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
29 అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.
30 అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,
31 వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,
32 నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.
33 అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.
34 నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
35 అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది
36 చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.
37 నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.
38 అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.
39 నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.
40 అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.
41 దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.
42 అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.
43 అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.
44 అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
45 అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.
46 యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?
47 నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
48 చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.
49 ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?
50 ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.
కీర్తన 89 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019