22 ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.
23 అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.
24 నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.
25 సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.
26 నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.
27 నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.
28 నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
29 అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.
30 అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,
31 వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,
32 నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.
33 అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.
34 నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
35 అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది
36 చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.
37 నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.
38 అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.
39 నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.
40 అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.