8 యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.
9 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.
10 హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది.
11 దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు.
12 ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
13 అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు.
14 దుష్టత్వాన్ని గర్భం ధరించినవాడి సంగతి ఆలోచించండి. అతడు నాశనకరమైన ప్రణాళికలు రచిస్తూ, హానికరమైన అబద్ధాలకు జన్మనిస్తాడు.
15 వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు.