Text copied!
Bibles in Telugu

కీర్తన 78:18-45 in Telugu

Help us?

కీర్తన 78:18-45 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.
19 ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?
20 ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.
21 యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది.
22 వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు.
23 అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు.
24 ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు.
25 మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.
26 ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు.
27 ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు.
28 అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి.
29 వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు.
30 అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే,
31 వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు.
32 ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.
33 కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.
34 ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.
35 దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.
36 అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.
37 ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.
38 అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.
39 ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
40 అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.
41 మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.
42 ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,
43 ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.
44 నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.
45 ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.
కీర్తన 78 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019