7 నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
8 నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
9 యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
10 నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
11 నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
12 చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
13 చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
14 అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
15 నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
17 యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ.
18 అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
19 నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20 మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
21 ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
22 నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.