78 నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
79 నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
80 నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక.
81 కఫ్ నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
82 నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
83 నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
84 నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
85 నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
86 నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.