Text copied!
Bibles in Telugu

అపొస్తలుల కార్యములు 13:16-36 in Telugu

Help us?

అపొస్తలుల కార్యములు 13:16-36 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
17 “ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చాడు.
18 సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు.
19 కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
20 ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకూ దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు.
21 ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు.
22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
23 “అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.
24 ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు.
25 యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు.
26 “సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.
27 యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
28 ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు.
29 ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు.
30 అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు.
31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
33 “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’ అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
34 ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా, ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’ అని చెప్పాడు.
35 అందుకే వేరొక కీర్తనలో, ‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.
36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు.
అపొస్తలుల కార్యములు 13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019