Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - దానియేలు

దానియేలు 8

Help us?
Click on verse(s) to share them!
1బెల్షస్సరు రాజు పరిపాలన మూడవ సంవత్సరంలో దానియేలు అనే నాకు మొదట కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగింది.
2నేను దర్శనం చూశాను. చూస్తుండగా నేను ఏలాము ప్రాంతానికి చెందిన షూషను అనే పట్టణం కోటలో ఉండగా నాకు దర్శనం వచ్చింది.
3నేను ఊలయి అనే నది ఒడ్డున ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది. నేను కళ్ళెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ఒడ్డున నిలబడి ఉంది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు పొడవుగా ఉన్నాయి. అయితే ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది.
4ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమానికి, ఉత్తరానికి, దక్షిణానికి, పరుగులు పెడుతూ ఉండడం కనిపించింది. ఇలా జరుగుతుండగా దాన్ని ఎదిరించడానికైనా, దానికి చిక్కకుండా తప్పించుకోడానికైనా, ఏ జంతువుకూ శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టు చేస్తూ గొప్పదయింది.
5నేను ఈ సంగతి ఆలోచిస్తుంటే ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, కాళ్లు నేలపై మోపకుండా భూమి అంతటా పరుగులు తీసింది. దాని రెండు కళ్ళ మధ్య ఒక గొప్ప కొమ్ము ఉంది.
6ఈ మేకపోతు నది ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు దగ్గరికి వచ్చి, భయంకరమైన కోపంతో బలంతో దాన్ని కుమ్మింది.
7నేను చూస్తుండగా ఆ మేకపోతు పొట్టేలుపై తిరగబడి, భీకరమైన రౌద్రంతో దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. ఆ పొట్టేలు దాని నెదిరించలేక పోయింది. ఆ మేకపోతు దాన్ని నేలపై పడేసి తొక్కుతూ ఉంది. దాని బలాన్ని అదుపు చేసి ఆ పొట్టేలును తప్పించడం ఎవరివల్లా కాలేదు.
8ఆ మేకపోతు విపరీతంగా పెరిగి పోయింది. అది బాగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగాయి.
9ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్నకొమ్ము మొలిచింది. అది దక్షిణానికి, తూర్పుకు, ఇశ్రాయేలు మహిమాన్విత దేశం వైపుకు అత్యధికంగా ప్రబలింది.
10ఆకాశ సైన్యంతో యుద్ధమాడేటంతగా అది పెరిగిపోయి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసి కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
11ఆ సైన్యాధిపతికి విరోధంగా గొప్పదైపోయి, అనుదిన బలి అర్పణలను ఆపి వేసి ఆయన ఆలయాన్ని పాడు చేసింది.
12తిరుగుబాటు మూలంగా ఆ మేకపోతు కొమ్ముకు ఒక సేన ఇవ్వడం జరిగింది. అతడు సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టానుసారంగా జరిగిస్తూ వర్థిల్లాడు.
13అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాటలాడగా విన్నాను. అంతలో మాట్లాడుతూ ఉన్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే “దహన బలిని గూర్చి, నాశనకారకమైన పాపం గురించి, ఆలయం అప్పగించడం, ఆకాశ సైన్యం కాలి కింద తొక్క బడడం కనిపించిన ఈ దర్శనం నెరవేరడానికి ఎన్నాళ్లు పడుతుంది” అని మాట్లాడుకున్నారు.
14అతడు “2, 300 రోజుల వరకే” అని నాతో చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగుతుంది.
15దానియేలు అనే నేను ఈ దర్శనం చూశాను. దాన్ని గ్రహించ గలిగిన వివేకం పొందాలని నాకు అనిపించింది. మనిషి రూపం ఉన్న ఒకడు నా ఎదుట నిలబడ్డాడు.
16అప్పుడు ఊలయి నదీతీరాల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనిషి స్వరం విన్నాను. అది “గాబ్రియేలూ, ఈ దర్శనభావాన్ని ఇతనికి తెలియజెయ్యి” అని వినిపించింది.
17అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.
18అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు గాఢనిద్ర పట్టి నేలపై సాష్టాంగపడ్డాను. కాబట్టి అతడు నన్ను పట్టుకుని లేపి నిలబెట్టాడు.

19అతడు “ఉగ్రత పూర్తి అయ్యే కాలంలో జరగబోయే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలాన్ని గురించినది.
20నీవు చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు మాదీయుల పారసీకుల రాజులను సూచిస్తున్నది.
21బొచ్చు ఉన్న ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని రెండు కళ్ళ మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది.
22అది పెరిగిన తరువాత దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టాయి గదా. నలుగురు రాజులు ఆ జాతిలో పుడతారు గాని వారికి అతనికున్నంత బలం ఉండదు.
23వారి పరిపాలన అంతంలో వారి అతిక్రమాలు పూర్తి ఆవుతుండగా, క్రూరముఖం ఒక రాజు వస్తాడు. అతడు చాలా యుక్తిపరుడు.
24అతడు శక్తిశాలి గాని అది అతని స్వశక్తి కాదు. అతడు విస్తృతంగా విధ్వంసం జరిగిస్తాడు. తాను చేసే ప్రతి దానిలోనూ సఫలుడౌతాడు. అతడు బలిష్టులైన ప్రజలను పరిశుద్ధ ప్రజలను నాశనం చేస్తాడు.
25అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.
26ఆ దినాలను గూర్చిన దర్శనాన్ని గూర్చి చెప్పినది వాస్తవం, నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయవద్దు. ఎందుకంటే అది భవిషత్తులో నెరవేరుతుంది.”
27దానియేలు అనే నేను తట్టుకోలేక కొన్నాళ్లు నీరసంగా పడి ఉన్నాను. తరువాత నేను లేచి రాజు కోసం చేయవలసిన పని చేస్తూ వచ్చాను. ఈ దర్శనాన్ని గూర్చి నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండిపోయాను. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరూ లేరు.