Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 8

1 రాజులు 8:24-60

Help us?
Click on verse(s) to share them!
24నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి, నీవిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చావు.
25యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, ‘నీవు ఏవిధంగా నా ఎదుట నడుచుకున్నావో అదే విధంగా నీ సంతానం మంచి నడవడి కలిగి, నా ఎదుట నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ కుటుంబంలో ఉండక మానడు’ అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు నీ వాగ్దానాన్ని స్థిరపరచు.
26ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి.
27వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది?
28అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు.
29నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా ‘నా నామం అక్కడ ఉంటుంది’ అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక.
30నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.
31ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు,
32నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు.
33నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకుని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు
34నీవు ఆకాశం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు.
35వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
36నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు.
37దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,
38నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే
39ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
40మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.
41నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి
42నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే
43నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.
44నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,
45ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.
46పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,
47వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
48వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,
49నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు.
50నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.
51వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు.
52కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.
53ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.”
54సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు.
55అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,
56“తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.
57కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి
58తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక.
59ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక.
60అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు.

Read 1 రాజులు 81 రాజులు 8
Compare 1 రాజులు 8:24-601 రాజులు 8:24-60