Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 2

1 రాజులు 2:13-38

Help us?
Click on verse(s) to share them!
13అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది. అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి,
14తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు. ఆమె “ఏమిటో చెప్పు” అంది.
15అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది.
16ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.
17ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
18బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
19బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
20ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది. రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.
21అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.
22అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.
23అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక.
24నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు.
25అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.
26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను” అని చెప్పాడు.
27తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది.
28యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.
29యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి “నీవు వెళ్లి అతని మీద పడి చంపు” అని ఆజ్ఞాపించాడు.
30బెనాయా యెహోవా గుడారానికి వచ్చి “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని యోవాబుతో చెప్పాడు. అతడు “రాను, నేనిక్కడే చనిపోతాను” అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.
31అందుకు రాజు ఇలా అన్నాడు. “అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి.
32నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు.
33అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”
34కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు.
35రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.
36తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. “నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు.
37నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.”
38అప్పుడు షిమీ “మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను” అని రాజుతో చెప్పాడు. షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు.

Read 1 రాజులు 21 రాజులు 2
Compare 1 రాజులు 2:13-381 రాజులు 2:13-38