Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - రోమీయులకు రాసిన పత్రిక - రోమీయులకు రాసిన పత్రిక 8

రోమీయులకు రాసిన పత్రిక 8:5-27

Help us?
Click on verse(s) to share them!
5శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
6శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.
7ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.
8కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.
9దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.
10క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది.
11చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
12కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
13మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
14దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
15ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం.
16మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.
17మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
18మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
19దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
20ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి,
21నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.
22ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.
23అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
24ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు?
25మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
26అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.
27ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

Read రోమీయులకు రాసిన పత్రిక 8రోమీయులకు రాసిన పత్రిక 8
Compare రోమీయులకు రాసిన పత్రిక 8:5-27రోమీయులకు రాసిన పత్రిక 8:5-27