Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 11

యెహో 11:1-21

Help us?
Click on verse(s) to share them!
1హాసోరు రాజు యాబీను జరిగిన ఇశ్రాయేలీయులు విజయాలు గూర్చి విని మాదోను రాజు యోబాబుకూ, షిమ్రోను రాజుకూ, అక్షాపు రాజుకూ,
2ఉత్తరం వైపున ఉన్న మన్యదేశంలో కిన్నెరెతు దక్షిణం వైపున ఉన్న అరాబాలో షెఫేలాలో పడమట ఉన్న దోరు కొండ ప్రాంతంలో ఉన్న రాజులకూ,
3తూర్పు పడమటి దిక్కుల్లో ఉన్న కనానీయులకూ, అమోరీయులకూ, హిత్తీయులకూ, పెరిజ్జీయులకూ, కొండ ప్రాంతంలో ఉన్న యెబూసీయులకూ, మిస్పా దేశంలోని హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకూ కబురు పంపించాడు.
4వారంతా సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరారు.
5ఆ రాజులంతా కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర దిగారు.
6అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు. రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చినవారుగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు” అని యెహోషువతో చెప్పాడు.
7కాబట్టి యెహోషువ, అతనితో ఉన్న యోధులంతా హఠాత్తుగా మేరోము నీళ్ల దగ్గరికి వచ్చి వారిపై దాడి చేశారు.
8యెహోవా, ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి మహా సీదోను వరకూ మిశ్రేపొత్మాయిము వరకూ తూర్పు వైపు మిస్పా లోయ వరకూ వారిని తరిమి ఒక్కడు కూడా మిగలకుండా చంపారు.
9యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలుని తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు.
10ఆ సమయంలోనే యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తితో హతం చేశాడు. గతంలో హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి.
11ఇశ్రాయేలు ప్రజలు దానిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కత్తితో హతం చేశారు. ఎవ్వరూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేశాడు. తరువాత అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు.
12యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణాలను వశం చేసుకుని వాటిని నాశనం చేశాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలం చేశాడు.
13అయితే యెహోషువ హాసోరుని కాల్చినట్టు మట్టి దిబ్బల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు.
14ఆ పట్టణాలకు సంబంధించిన కొల్లసొమ్మునూ పశువులనూ ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. మనుషుల్లో ఒక్కర్నీ విడిచిపెట్టకుండా అందర్నీ నాశనం చేసే వరకూ కత్తితో హతం చేశారు.
15యెహోవా తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ ఆప్రకారమే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చేయకుండా విడిచిపెట్టలేదు.
16యెహోషువ శేయీరుకు పోయే హాలాకు కొండ నుండి
17లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు వరకూ ఆ దేశమంతటినీ అంటే కొండ ప్రాంతాన్నీ, దక్షిణ దేశమంతటినీ, గోషేను దేశమంతటినీ, షెఫేలా ప్రదేశాన్నీ, మైదానాన్నీ, ఇశ్రాయేలు కొండలనూ వాటి లోయలనూ వాటి రాజులందర్నీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు.
18చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసాడు. గిబియోను ప్రజలూ హివ్వీయులూ కాకుండా
19ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసిన పట్టణం ఇంకేదీ లేదు. ఆ పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలో తమ వశం చేసుకున్నారు.
20“వారిని నిర్మూలం చేయండి” అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు ప్రజలు కనికరం లేకుండా వారిని నాశనం చేయడాని వీలుగా, వారు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు.
21ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో అంటే హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని వారి పట్టణాలనూ నిర్మూలం చేశాడు.

Read యెహో 11యెహో 11
Compare యెహో 11:1-21యెహో 11:1-21