Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - మార్కు - మార్కు 4

మార్కు 4:24-39

Help us?
Click on verse(s) to share them!
24యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
25కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.”
26ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
27ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
28ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
29పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”
30ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
31అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
32కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”
33యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.
34ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు.
35ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.
36శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.
37అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.
38పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
39ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

Read మార్కు 4మార్కు 4
Compare మార్కు 4:24-39మార్కు 4:24-39