Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 119

కీర్తన 119:90-128

Help us?
Click on verse(s) to share them!
90నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
91అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
92నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.
93నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.
94నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.
95నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
96సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు.
97మేమ్‌ నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
98నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
99నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
100నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
101నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
102నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
103నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
104నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.
105నూన్‌ నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
106నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
107యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.
108యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు
109నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.
110నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.
111నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.
112నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.
113సామెహ్‌ రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
114నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
115నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.
116నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.
117నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.
118నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.
119భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.
120నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.
121అయిన్‌ నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.
122మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.
123నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.
124నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
125నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి
126ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.
127బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.
128నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.

Read కీర్తన 119కీర్తన 119
Compare కీర్తన 119:90-128కీర్తన 119:90-128