Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 7

అపొస్తలుల కార్యములు 7:16-48

Help us?
Click on verse(s) to share them!
16వారిని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు.
17అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.
18చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది.
19ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను బాధించాడు.
20“ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.
21అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది.
22మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.
23అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు.
24అప్పుడు వారిలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఆ ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు.
25తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి తన ప్రజలు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు.
26“ఆ తరువాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి, ‘అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు’ అని వారికి సర్ది చెప్పాలని చూశాడు.
27అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు, ‘మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?
28నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు.
29మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు.
30నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.
31మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని స్పష్టంగా చూడ్డానికి దగ్గరికి వచ్చినపుడు
32‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి’ అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు.
33ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం.
34ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.’
35“‘మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు?’ అని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు.
36మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు.
37‘నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో నుండి లేవనెత్తుతాడు’ అని ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే.
38సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మనకు ఇవ్వడానికి జీవవాక్యాలను తీసుకున్నదీ ఇతడే.
39“మన పూర్వీకులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వారు అతనిని తోసిపుచ్చి తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగారు.
40అప్పుడు వారు ‘మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు’ అని అహరోనుతో అన్నారు.
41ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.
42అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా ‘ఇశ్రాయేలీయులారా, నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
43మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’
44మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది.
45మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది.
46దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు.
47కాని సొలొమోను మందిరం కట్టించాడు.
48“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.

Read అపొస్తలుల కార్యములు 7అపొస్తలుల కార్యములు 7
Compare అపొస్తలుల కార్యములు 7:16-48అపొస్తలుల కార్యములు 7:16-48