Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 3

అపొస్తలుల కార్యములు 3:12-26

Help us?
Click on verse(s) to share them!
12పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
13అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.
14పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
15మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
16ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
17సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
18అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.
19కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
20అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
21అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.
22మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’
23ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.
24“సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
25‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
26దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”

Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3
Compare అపొస్తలుల కార్యములు 3:12-26అపొస్తలుల కార్యములు 3:12-26