Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 17

అపొస్తలుల కార్యములు 17:5-17

Help us?
Click on verse(s) to share them!
5అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.
6అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
7వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
8జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు.
9వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.
10సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు.
11వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
12అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
13అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు.
14వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.
15పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
16పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
17అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.

Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17
Compare అపొస్తలుల కార్యములు 17:5-17అపొస్తలుల కార్యములు 17:5-17