Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 13

అపొస్తలుల కార్యములు 13:10-37

Help us?
Click on verse(s) to share them!
10అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా?
11ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు.
12అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
13తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫులియా లోని పెర్గ కు వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు.
14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు.
15ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, “సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ప్రోత్సాహ వాక్కు చెప్పాలంటే చెప్పండి” అని అడిగారు.
16అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
17“ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చాడు.
18సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు.
19కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
20ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకూ దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు.
21ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు.
22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
23“అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.
24ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు.
25యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు.
26“సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.
27యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
28ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు.
29ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు.
30అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు.
31ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
32పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
33“‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’ అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
34ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా, ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’ అని చెప్పాడు.
35అందుకే వేరొక కీర్తనలో, ‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.
36దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు.
37తన పితరుల దగ్గర సమాధి అయి కుళ్ళిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు.

Read అపొస్తలుల కార్యములు 13అపొస్తలుల కార్యములు 13
Compare అపొస్తలుల కార్యములు 13:10-37అపొస్తలుల కార్యములు 13:10-37